Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 29

Vamana Avatara !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

అథ తస్యా ప్రమేయస్య తద్వనం పరిప్చ్ఛతః|
విశ్వామిత్రో మహాతేజావ్యాఖ్యాతుమ్ ఉపచక్రమే ||

తా|| ప్రమేయములేనివానివలె ఆ వనముగురించి ప్రశ్నించగా అప్పుడు మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు విశదముగా చెప్పుటకు ఉపక్రమించెను.

బాలకాండ
ఇరువదితొమ్మిదవ సర్గము
(సిద్ధాశ్రమ వృత్తాంతము - విశ్వామిత్రుని యజ్ఞ దీక్ష)

ప్రమేయములేని వాని వలె శ్రీరాముడు ఆ వనముగురించి ప్రశ్నించగా అప్పుడు మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు విశదముగా చెప్పుటకు ఉపక్రమించెను.

'ఓ రామా ! దేవులలో శ్రేష్ఠుడైన మహావిష్ణువు అనేక వందలయుగములపాటు లోకకల్యాణము కొఱకు తపస్సు చేయుచూ ఇచట నివశించెను. వామనావతారమునకు ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిపొందుటవలను, అలాగే మహా తపోధనులు ఇచట సిద్ధి పొందుటవలననూ ఈ ఆశ్రమమునకు సిద్దాశ్రమమని ప్రసిద్ధిపొందెను ".

'అదే కాలములో విరోచనుని కుమారుడగు బలి ఇంద్రునితో కూడిన దేవగణములనూ మరుద్గణములనూ జయించి ముల్లోకములకు రాజై పరిపాలించుచుండెన. బలి యజమాన్యములో యజ్ఞము జరుగుచున్నప్పుడు దేవతలందరూ కలిసి అగ్నిని ముందుగా ఉంచుకొని స్వయముగా ఈ ఆశ్రమములో విష్ణువుతో ఇట్లు విన్నవించుకొనిరి. "ఓ మహావిష్ణో ! విరోచనుని పుత్రుడగు బలి ఇచట ఉత్తమమైన యజ్ఞమును కావించుచున్నాడు. ఆక్రతు సమాప్తము అగకుండా మా కార్యము చేయవలసినది ఉన్నది. ఇచటికి అన్నిచోటలనుంచి యాచకులు వచ్చుచున్నారు. వారు కోరినరీతిగా అన్నియూ వారికి ఇవ్వబడుచున్నవి. ఓ విష్ణో ! దేవతల హితముకోసము మాయాయోగము ఆశ్రయించి వానావతారము పొంది లోకకల్యాణము చేయుము'.

' అదే కాలములో అగ్నితో సమానమైన తేజస్సు కల కాశ్యపమహాముని తన భార్యయగు అదితో కలిసి వెలుగుచుండెను. ఆ దేవితో కలిసి వేలకొలదీ సంవత్సరములు వ్రతమాచరించి మధుసూదనుని సంతుష్టునిగావించి ఈ విధముగా పలికెను. "ఓ ! పురుషోత్తమా ! నీవు తపోమయుడవు, తపోరాశివి తపోమూర్తివి. అట్టి నిన్ను తపస్సుచే అరాధించి చూచుచున్నాను. ఈ శరీరములో జగత్తునంతయూ చూచుచున్నాను. నీవు అనాద్యంతములు లేనివాడవు.నిన్ను శరణు కోరుచున్నాను".

'సంతుష్టుడైన శ్రీహరి కల్మషములేని ఆ కాశ్యపునితో ఇట్లనెను." ఓ సువ్రత ! వరమును కోరుకొనుము. నేను ఇచ్చెదను . నీవు అందులకు అర్హుడవు". ఆ మాటలను వినిన మరీచి కుమారుడగు కాశ్యపుడు ఇట్లు పలికెను. " అదితి , దేవతలూ నేనూ నిన్ను అర్థించుచుంటిమి. మాకు వరము ప్రసాదింపుము. వరములిచ్చుటకు నీవే తగినవాడవు. ఓ మహాత్మా నాకు అదితికి పుత్రుడుగా జన్మించుము" అని.

" ఓ అసురసూదనా ! ఇంద్రునకు తమ్ముడవు కమ్ము. శోకార్తులైన దేవతలకు నీవే సహాయము చేయగలవు. నీ ప్రసాదము వలన ఈ ఆశ్రమము సిద్ధాశ్రమమని పేరుపొందును. ఓ దేవ దేవా నీ అనుగ్రహమువలన మా తపస్సులు సిద్ధి పొందును. భగవన్ లెమ్ము ఇచటికి రమ్ము".

' అంతట మహాతేజోమయుడైన విష్ణువు అదితియందు జన్మించి, వామనరూపమును పొంది, విరోచనుని కుమారుడగు బలి వద్దకు వచ్చెను. పిమ్మట మూడడుగులు బిక్షగా అడిగి దానమును ప్రతిగ్రహించెను. సమస్త భూతములకూ హితముగూర్చు విష్ణువు అప్పుడు ముల్లోకములలో వ్యాపించి బలిని నిరోధించి మహేంద్రునకు మరల ముల్లోకముల అధిపతి చేసెను. ఈ విధముగా తేజోమయుడైన మహావిష్ణువు ఇంద్రుని అధిపతిగా చేసెను'.

'ఈ విధముగా ఈ ఆశ్రమము పూర్వము పవిత్రత పొందినది, ఈ ప్రదేశము శ్రమను నాశనమొనర్చును. నేను కూడా వామనుపై భక్తి శ్రద్దలతో ఈ ప్రదేశమును ఆశ్రయించితిని. ఈ ఆశ్రమమునకు విఘ్నకారకులగు రాక్షసులు వచ్చుచుందురు. ఓ పురుషవ్యాఘ్రా! ఇచటనే అ దుష్టాచరులను హంతమొనర్చవలయును. ఓ రామా ఈ దినమే ఉత్తమమైన సిద్దాశ్రమమునకు వెళ్ళుదము. నాయనా! ఆ ఆశ్రమము నాది మాత్రమే కాదు . నీది కూడా!'

అప్పుడు విశ్వామిత్రుడు ఆ ఆశ్రమము రామలక్ష్మణులతో ప్రవేశించుచూ మంచుతొలగి పునర్వుసు నక్షత్రముతో కూడిన చంద్రునివలె విరాజిల్లెను. వారి రాకను చూచి సిద్ధాశ్రమవాసులైన మునులందరూ లేచి వెంటనే ముందుకువచ్చి విశ్వామిత్రుని పూజించిరి. వారు ధీమంతుడగు విశ్వామిత్రుని యథోచితముగా పూజించి అట్లే ఆ రాజపుత్రులకు కూడా అతిథి క్రియలను సల్పిరి.

రఘునందనులూ శత్రుభయంకరులగు ఆ రాజపుత్రులిద్దరూ క్షణకాలము విశ్రమించి మునిశ్రేష్ఠుడగు విశ్వామిత్రునకు అంజలిఘటించి ఇట్లు పలికిరి.' ఓ మునీశ్వరా ఈ దినమే దీక్షగైకొనుడు. మీ సంకల్పము నెఱవేరును. ఈ సిద్ధాశ్రమము అను పేరు సార్థకమగును. మీ వచనములు సత్యమగును'. ఈ విధముగా చెప్పబడిన మాటలను విని మహాతేజోమయుడైన విశ్వామిత్రుడు నిశ్చల చిత్తుడై నియమ నిష్ఠలతో దీక్షను స్వీకరించెను.

ఆ రాజకుమారులు గూడా ఆ రాత్రి ని గడిపి ప్రభాత సమయమున లేచి పూర్వ సంధ్యాకార్యములను నిర్వర్తించిరి. శుచిఅయి ఉదకములను స్పృశించి నియమపూర్వకముగా జపములను సమాప్తి చేశిరి. పిమ్మట హుతాగ్ని హోత్రములముందు అశీనులైన విశ్వామిత్రునకి అభివాదమొనర్చిరి.

|| ఈ విధముగా బాలకాండలో ఇరువదితొమ్మిదవ సర్గము సమాప్తము ||

|| ఓమ్ తత్ సత్ ||

స్పృష్టోదకౌ శుచీ జప్యం సమాప్య నియమేవ చ |
హుతాగ్నిహోత్రమాసీనం విశ్వామిత్రమవందతామ్ ||

తా|| శుచిఅయి ఉదకములను స్పృశించి నియమపూర్వకముగా జపములను సమాప్తి చేశిరి. పిమ్మట హుతాగ్ని హోత్రములముందు అశీనులైన విశ్వామిత్రునకి అభివాదమొనర్చిరి.
||ఓమ్ తత్ సత్ ||

||om tat sat ||